NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:35 pm Posted by : NAMASTHE BHARAT

కుత్బుల్లాపూర్‌కు రూ.270 కోట్ల రహదారి వరం

కుత్బుల్లాపూర్‌కు రూ.270 కోట్ల రహదారి వరం

కొంపల్లి–బహదూర్‌పల్లి, గండి మైసమ్మ–మియాపూర్ రహదారుల పనులపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష

-రూ.270 కోట్లతో రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులకు వేగం

-అటవీ శాఖ అనుమతుల జాప్యం తొలగించి పనులు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం

-పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం

-ప్రజలకు మెరుగైన రవాణా.. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

-రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్, జులై 27 ( నమస్తే భరత్) :కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.270 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రధాన రహదారి నిర్మాణ పనులను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. అనంతరం ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్తో కలిసి కొంపల్లి–బహదూర్‌పల్లి రహదారి విస్తరణ పనులకు రూ.130 కోట్లు, గండి మైసమ్మ–మియాపూర్ రహదారి నిర్మాణానికి రూ.140 కోట్లు వెచ్చిస్తూ మొత్తం రూ.270 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమగ్రంగా చర్చించి, పనుల అమలు తీరుపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంగా అటవీ శాఖ అనుమతులు లభించక ఈ రహదారి పనులు నిలిచిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన అనుమతులు వేగంగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుని పనులను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కలెక్టర్ మను చౌదరి, సీఎంసీ కమిషనర్ సృజన, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డి, బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.