ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
➤ దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖి
➤ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల వినతులు స్వీకరణ
➤ కాలనీల అభివృద్ధి సమస్యలపై సానుకూల స్పందన
➤ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్సీ హామీ
➤ బోనాల ఉత్సవాలు, శుభకార్యాలకు ఆహ్వానం అందజేసిన నాయకులు
➤ ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం
కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్); ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రతినిధులు, మహిళలు, స్థానిక ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తాగునీరు, మౌలిక వసతులు, పారిశుధ్యం, రహదారులు, కాలనీల అభివృద్ధి తదితర అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలు, వివిధ శుభకార్యక్రమాలకు హాజరుకావాలని స్థానిక నాయకులు, కాలనీల ప్రతినిధులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఆహ్వానించారు. ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించిన ఆయన, వీలైనంత మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు.