సేవా శిరోమణి అవార్డుతో రవీందర్ ముదిరాజ్‌కు ఘన సత్కారం

-ఉపాధి కల్పించే లక్ష్యంతో యువత ముందుకు సాగాలి: చల్ల రాజశేఖర్ రెడ్డి
-న్యాయాన్ని గౌరవిస్తూ అంకితభావంతో పనిచేయాలి: రిటైర్డ్ న్యాయమూర్తి మధుసూదన్
-యోగను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు
-ప్లాస్టిక్ నిర్మూలన, నీటి సంరక్షణపై రవీందర్ సేవలకు ప్రశంసలు
-విద్యార్థులను సన్మానించిన ప్రముఖులు
-సమాజ సేవకు మరింత సమయం కేటాయిస్తా: రవీందర్ ముదిరాజ్
కుత్బుల్లాపూర్, జూన్ 29 ( నమస్తే భరత్ ): సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, యువతలో చైతన్యం పెంపొందించడంలో విశేష కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్కు “సేవా శిరోమణి అవార్డు” ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ న్యాయమూర్తి మధుసూదన్, ప్రముఖ పారిశ్రామికవేత్త చల్ల రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ జ్యోతిష్యురాలు భాగ్యలక్ష్మి రెడ్డి, రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ ఎం.డి. హమీద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ న్యాయమూర్తి మధుసూదన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ అంకితభావంతో తమకు అనుభవం ఉన్న రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు. యువత న్యాయాన్ని గౌరవిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని, తమ శక్తి సామర్థ్యాలను ఇతరులకు ఉపయోగపడే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చల్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, యువత ఉన్నత విద్యతో పాటు సాంకేతిక విద్యను అభ్యసించి, ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. యోగను ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని, యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ ఎం.డి. హమీద్, ప్రముఖ జ్యోతిష్యురాలు భాగ్యలక్ష్మి రెడ్డి మాట్లాడుతూ, రవీందర్ ముదిరాజ్ చేస్తున్న సామాజిక సేవలను కొనియాడారు. ప్లాస్టిక్ నిర్మూలనపై నిరంతర అవగాహన కల్పించడం, పాఠశాలల్లో ఈత ప్రాముఖ్యతపై విద్యార్థులకు చైతన్యం తీసుకురావడం, నీటి సంరక్షణ, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సేవలను గుర్తించి రవీందర్ ముదిరాజ్కు “సేవా శిరోమణి అవార్డు” ప్రదానం చేసి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అవార్డు స్వీకరించిన అనంతరం రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఈ గౌరవంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇకపై సమాజ సేవకు మరింత సమయం కేటాయిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. అందరి సహకారం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని, ప్రతి వ్యక్తిలో పట్టుదల, కృషి, సేవాభావం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, యోగా సాధకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.