NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 2:26 pm Posted by : NAMASTHE BHARAT

రాజీవ్ రహదారి విస్తరణకు వేగం

రాజీవ్ రహదారి విస్తరణకు వేగం

తూంకుంటలో నిర్మాణాల కూల్చివేత ప్రారంభం
➤ సికింద్రాబాద్–శామీర్‌పేట్ మార్గం అభివృద్ధి పనులు శరవేగంగా
➤ భూ నిర్వాసితులకు ఇప్పటికే నష్టపరిహారం చెల్లింపు
➤ మూడు నెలల గడువు అనంతరం స్థలాన్ని హెచ్ఎండీఏకు అప్పగింత
➤ పంచనామా పూర్తి చేసి ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం

కుత్బుల్లాపూర్, జూన్ 20 ( నమస్తే భరత్ ): సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు చేపడుతున్న రాజీవ్ రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా తూంకుంట ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయగా, వారి విజ్ఞప్తి మేరకు నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు మూడు నెలల గడువు కల్పించారు. గడువు ముగియడంతో ఎస్‌డీసీఎల్ అధికారులు సేకరించిన భూమికి పంచనామా నిర్వహించి, జూన్ 6న హెచ్ఎండీఏ అధికారులకు అధికారికంగా అప్పగించారు. ఈ నేపథ్యంలో శనివారం ఎస్‌డీసీఎల్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ మాలతి ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ అధికారులు తూంకుంటలో ఉన్న నిర్మాణాల కూల్చివేత పనులను ప్రారంభించారు. రహదారి విస్తరణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ సర్వేయర్ వినయ్‌కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాఘవ, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ఇంజనీర్ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు.