NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:30 pm Posted by : NAMASTHE BHARAT

పోలీసు వేషంలో దందా… నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్

పోలీసు వేషంలో దందా… నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్

-హాస్టల్‌లోకి చొరబడి యువతులను బెదిరించిన కేటుగాడు

-వ్యభిచార కేసులు పెడతానంటూ నగదు వసూలు

-పేట్ బషీరాబాద్ పోలీసులు చాకచక్యంగా ఛేదించిన కేసు

-నిందితుడి వద్ద నగదు, పోలీసు యూనిఫాం, బైక్, మొబైల్ స్వాధీనం

-ట్రాఫిక్ పోలీసుగా నటిస్తూ వాహనదారుల నుంచీ కూడా వసూళ్లు

-నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన

కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): పోలీసు కానిస్టేబుల్‌గా నటిస్తూ యువతులను, ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసును పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి నగదు, పోలీసు యూనిఫాం, మొబైల్ ఫోన్, పల్సర్ మోటార్ సైకిల్, టాయ్ గన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్ధిపేట జిల్లా ములుగు మండలం బండ మైలారం గ్రామానికి చెందిన పండి యాదగిరి అలియాస్ అనిల్ కుమార్ (25) ప్రస్తుతం సెక్యూరిటీ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో మహంకాళి ట్రాఫిక్ పోలీసుల వద్ద క్యాజువల్ లేబరర్‌గా పని చేసిన అనుభవంతో పోలీసుల వ్యవహారశైలిని గమనించిన అతడు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పోలీసు యూనిఫాం, జెర్కిన్ సమకూర్చుకుని పోలీసుగా చలామణి అవుతున్నాడు. దుండిగల్ ప్రాంతంలోని ఓ బాలికల హాస్టల్‌లో గతంలోనూ ఇదే తరహాలో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. అలాగే పేట్ బషీరాబాద్–మేడ్చల్ రహదారిపై ట్రాఫిక్ పోలీసుగా నటిస్తూ వాహనదారులను ట్రాఫిక్ కేసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు పదిహేను రోజుల క్రితం సూచిత్రలోని మోనిడా శ్రీ గర్ల్స్ హాస్టల్ నిర్వహకులను రాత్రి 10:30 గంటల తర్వాత హాస్టల్ నిర్వహించవద్దని హెచ్చరించిన నిందితుడు, జూన్ 29 రాత్రి మళ్లీ హాస్టల్‌కు వెళ్లి యువతులను వ్యభిచార కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరించాడు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫొటోలు తీసి, కేసులు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.5 వేలివ్వాలని డిమాండ్ చేసి చివరకు రూ.2 వేల నగదు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ నిర్వాహకుడు గూడూరు విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.2 వేల నగదు, పోలీసు యూనిఫాం, ఖాకీ దుస్తులు, బెల్ట్, నేమ్‌ప్లేట్, జెర్కిన్, రెడ్‌మీ మొబైల్ ఫోన్, పల్సర్ మోటార్ సైకిల్, పౌచ్, టాయ్ గన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో పేట్ బషీరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు కొన్ని సూచనలు చేశారు. పోలీసులమంటూ వచ్చే వ్యక్తుల గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించాలని, అనుమానం కలిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.