ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.
పరకాల ఆగస్టు 16 (నమస్తే భారత్): పరకాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.424 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు మహిళా అభ్యున్నతి, ఆధునిక సాంకేతికత, రహదారుల అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు, పరకాల దేవస్థానానికి రూ.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వచ్చే సెప్టెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాలకు “అయ్యా, కొడుకు, అల్లుడు రండి.. చర్చించుకుందాం” అంటూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి సవాల్ విసిరారు.
తెలంగాణ అభివృద్ధి, రైతులు, పేదలు, మహిళల సంక్షేమంపై గత ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడాను అసెంబ్లీలో చర్చిద్దామని అన్నారు.
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందని సీఎం తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసి, రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో రూ.90 వేల కోట్లు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఉచిత విద్యుత్ అందిస్తూ ప్రజలపై విద్యుత్ భారాన్ని పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
• రైతు రాజ్యమే కాంగ్రెస్ లక్ష్యం:
గతంలో వరి పంట వేస్తే ఉరి వేసుకున్నట్లేనని చెప్పిన కేసీఆర్ మాటలను ప్రస్తావిస్తూ, నేడు తెలంగాణ రైతులు వరి పంట పండించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చామని సీఎం అన్నారు. రైతులకు మద్దతుగా నిలిచి రైతు రాజ్యాన్ని నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
• మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం:
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు అందించిన బతుకమ్మ చీరలపై కూడా ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలతో మహిళల్లో ఆనందాన్ని నింపుతోందని పేర్కొన్నారు.
• పరకాల అభివృద్ధికి మరిన్ని నిధులు:
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. సభను విజయవంతం చేసిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు పరకాల శాసనసభ్యులు రేవుల ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.