తన జీతంతో యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ 90 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్
నమస్తే భారత్ :-తొర్రూరు
రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇస్తూ, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ ముందుకు సాగుతున్న పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగా లభిస్తున్న తన జీతాన్ని ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో స్వంత నిధుల ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి యువత నుంచి విశేష స్పందన లభించగా, తొలి బ్యాచ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 90 మంది విద్యార్థిని, విద్యార్థులకు తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వయంగా సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ. విద్యే యువతకు అతిపెద్ద ఆస్తి, నైపుణ్యమే భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యోగార్థికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శిక్షణకు దూరమవుతున్న యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తన జీతంలో నుంచి.ఈకార్యక్రమాన్ని.ప్రారంభించానని తెలిపారు.పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి యువకుడు, యువతి ఉద్యోగాలు సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నదే తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని,వాటిని.అందిపుచ్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను యువత తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు.
యువత సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, విద్య, నైపుణ్యం, ఉపాధి అనే మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి, ఎక్కువ మంది యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమాలకు తన వంతు బాధ్యతగా కృషి చేయడం యశస్విని రెడ్డి ప్రత్యేకతగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి రూపాయిని తిరిగి ప్రజల అభ్యున్నతికే వినియోగించాలనే సంకల్పంతో తన జీతాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అభినందనీయమని కొనియాడారు.సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఉచితంగా నాణ్యమైన కంప్యూటర్ శిక్షణ అందించడం తమ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయని, ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది యువతకు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు ముత్తినేని సోమేశ్వర్ రావు, కౌన్సిలర్ పార్టీ సీనియర్ నాయకులు బాపు రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్, మండల అధ్యక్షులు రవీంద్ర చారి, మాజీ మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, గుండాల నర్సయ్య, చిత్తలూరి శ్రీనివాస్, పట్టణ యువజన అధ్యక్షులు మహేష్ యాదవ్, మహబూబ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, శిక్షణ సంస్థ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థుల, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు.తదితరులు పాల్గొన్నారు.