విస్పర్ వ్యాలీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
నూతన కమిటీ సభ్యులతో మర్యాదపూర్వక సమావేశం
డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల సమస్యలపై వినతి
అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
బాచుపల్లి, జూన్ 19 (నమస్తే భరత్); నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పి. వివేకానంద్ పేర్కొన్నారు. బాచుపల్లి–నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని 274వ వార్డు రాజీవ్ గాంధీ నగర్‌లో ఉన్న విస్పర్ వ్యాలీ కాలనీ నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కాలనీ సమగ్ర అభివృద్ధికి తనవంతు సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కాలనీ ప్రతినిధులు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు, వీధి దీపాల కొరత వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యల కారణంగా కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వారి వినతిపై స్పందించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాలాజీ నాయక్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు చంద్రగిరి సతీష్, 20వ వార్డు బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి, ఉపాధ్యక్షురాలు పద్మావతి, ప్రధాన కార్యదర్శి నాగమణి, సోషల్ మీడియా అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. అలాగే విస్పర్ వ్యాలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షుడు ప్రసాద్ రాజు, ప్రధాన కార్యదర్శి లీలావతి, సంయుక్త కార్యదర్శి పృథ్వీ కుమార్, కోశాధికారి రామకృష్ణ బండి, కాలనీ వాసులు చిట్టిబాబు, ప్రసాద్, రామ్ ప్రసాద్, అశోక్, రదీప్, రవితేజ తదితరులు హాజరయ్యారు.