NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:15 pm Posted by : NAMASTHE BHARAT

దేవాలయ భూముల కబ్జాలను అడ్డుకోండి

దేవాలయ భూముల కబ్జాలను అడ్డుకోండి

→ రాజకీయ అండదండలతో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ జనసేన ఫిర్యాదు

→ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

→ ఆక్రమణలపై ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు వినతి

→ స్థల ఆక్రమణకు భూమిపూజలు చేయడంపై జనసేన ఆగ్రహం

→ ప్రభుత్వ, దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి

→ నైబ్‌ తహసీల్దార్‌కు ఫిర్యాదు పత్రం అందజేసిన జనసేన నేతలు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 14 (నమస్తే భరత్): జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలో కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములను ఆక్రమణల నుంచి పరిరక్షించాలని కోరుతూ జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నందగిరి సతీష్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆలయ భూముల్లో కొంతమంది వ్యక్తులు స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్థల ఆక్రమణలకు భూమిపూజలు సైతం నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తరహా ఆక్రమణలను తక్షణమే అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఆలయానికి సంబంధించిన విలువైన భూములు పూర్తిగా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ భూములపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ రికార్డులను పరిశీలించి, ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందగిరి సతీష్‌ అధికారులను కోరారు. ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో నైబ్‌ తహసీల్దార్‌ సుధాకర్‌కు జనసేన నాయకులు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ భూముల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.