NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 11:50 am Posted by : NAMASTHE BHARAT

గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి

గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి

బాచుపల్లి పరిధిలో సెక్యూరిటీ సంస్థలతో డీసీపీ సమన్వయ సమావేశం

-పోలీస్–ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య సమన్వయం పెంచాలని సూచన

-నేపథ్య పరిశీలన పూర్తైన సిబ్బందినే విధుల్లో నియమించాలని ఆదేశం

-అనుమానాస్పద ఘటనలు వెంటనే డయల్–100కు
తెలియజేయాలని సూచన

-సీసీటీవీ నిఘా, విజిటర్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

-సెక్యూరిటీ గార్డులకు నిరంతర శిక్షణ నిర్వహించాలని సూచనలు

-కండ్లకోయ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో సమావేశం నిర్వహణ

బాచుపల్లి, జూన్ 27 ( నమస్తే భరత్ ): గేటెడ్ కమ్యూనిటీల భద్రతను మరింత పటిష్టం చేయడం, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు–స్థానిక పోలీసుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులు, సెక్యూరిటీ మేనేజర్లు, సూపర్‌వైజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) అధ్యక్షతన శనివారం కండ్లకోయలోని సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో జరిగిన ఈ సమావేశంలో భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, గేటెడ్ కమ్యూనిటీల్లో విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది నేరాల నివారణలో తొలి రక్షణ కవచంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్–100కు సమాచారం అందించాలని సూచించారు. విధుల్లో నియమించే ప్రతి సెక్యూరిటీ గార్డుకు అర్హతలు, పూర్తి స్థాయి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. వారి గుర్తింపు పత్రాలు, ఫోటోలు, చిరునామా, ఉద్యోగ వివరాలను సక్రమంగా నిర్వహించాలని సెక్యూరిటీ సంస్థలకు సూచించారు. ఇటీవలి కొన్ని సంఘటనల నేపథ్యంలో నేపాలీ సెక్యూరిటీ గార్డుల నియామకంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వారి గుర్తింపు, చిరునామా ధృవీకరణతో పాటు అవసరమైన అన్ని పత్రాలను పరిశీలించిన అనంతరమే విధుల్లో నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా, గేటెడ్ కమ్యూనిటీల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, క్రమం తప్పకుండా సెక్యూరిటీ ఆడిట్లు నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంపై సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వడం, విజిటర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం, భద్రతా రికార్డులను సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో కుత్బుల్లాపూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాలగంగి రెడ్డి, బాచుపల్లి ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సి. సతీష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సురేష్‌తో పాటు వివిధ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులు, గేటెడ్ కమ్యూనిటీల సెక్యూరిటీ మేనేజర్లు పాల్గొన్నారు.