NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 12:54 pm Posted by : NAMASTHE BHARAT

దూలపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల మెరుపుదాడి

దూలపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల మెరుపుదాడి

-అర్ధరాత్రి అందిన సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసుల చర్య

-23 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం

-నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు

-అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

పేట్ బషీరాబాద్, జూన్ 29 ( నమస్తే భరత్ ): దూలపల్లిలో అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న వ్యక్తిపై పేట్ బషీరాబాద్ పోలీసులు అర్ధరాత్రి మెరుపుదాడి నిర్వహించి 23 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 28/29 తేదీల అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో దూలపల్లిలోని ఓ ఇంటిలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ సిబ్బంది ఇద్దరు పంచుల సమక్షంలో సంబంధిత ఇంటిపై దాడి నిర్వహించారు. తనిఖీల్లో విక్రయాల కోసం అక్రమంగా నిల్వ ఉంచిన మొత్తం 23 లీటర్ల మద్యాన్ని పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలు, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేట్ బషీరాబాద్ పోలీసులు హెచ్చరించారు.