విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ
ఖానాపురం జూలై 3 (నమస్తే భారత్ ) :
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు, రైతులు మరియు వినియోగదారులు విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని టీజీఎన్‌పీడీసీఎల్ ఖానాపురం ఏఈ మంగమ్మ తెలిపారు.
ప్రజలు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
– తడి చేతులతో మోటార్ స్టార్టర్లను లేదా ఇతర విద్యుత్ పరికరాలను ఆన్/ఆఫ్ చేయరాదు.
– సర్వీస్ వైర్లకు అతుకులు లేకుండా, నాణ్యమైన వైర్లనే ఉపయోగించాలి. పగిలిన స్విచ్‌లు, దెబ్బతిన్న ప్లగ్‌లు వెంటనే మార్చాలి.
– విద్యుత్ పరికరాలకు మరమ్మతులు చేసే ముందు తప్పనిసరిగా మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి.
– తెగిపోయిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి, సమీప సబ్‌స్టేషన్‌కు లేదా 1912 టోల్-ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.
– విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్లకు పశువులను కట్టరాదు.
– ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్‌లు పోయినప్పుడు సొంతంగా వేయడానికి ప్రయత్నించరాదు. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి లేదా 1912కు సమాచారం ఇవ్వాలి.
– అడవి జంతువుల నుండి పంటలను కాపాడేందుకు పొలాల కంచెలకు విద్యుత్ ప్రవహింపజేయరాదు. ఇది ప్రాణాపాయం కలిగించడమే కాకుండా చట్టరీత్యా నేరం.
– ఎలక్ట్రికల్ లైన్ల కింద బోర్లు వేయరాదు. బోరు మోటార్లను మరమ్మతుల కోసం పైకి తీసేటప్పుడు సమీప విద్యుత్ లైన్లకు తగలకుండా అత్యంత జాగ్రత్త వహించాలి.
– తడి బట్టలు ఆరబెట్టేందుకు ఇనుప రాడ్లు లేదా ఇనుప దండాలు ఉపయోగించరాదు. ప్లాస్టిక్ తాడులను మాత్రమే ఉపయోగించాలి.
– విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి చేపలు పట్టరాదు. ఇది ప్రాణాపాయంతో పాటు చట్టరీత్యా నేరం.
– చెడిపోయిన విద్యుత్ పరికరాలను సొంతంగా మరమ్మతు చేయకుండా అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్‌తోనే మరమ్మతు చేయించుకోవాలి.
– లూజ్‌గా ఉన్న విద్యుత్ తీగలను కర్రలతో పైకి లేపే ప్రయత్నం చేయరాదు. వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు లేదా 1912కు సమాచారం అందించాలి.
– నాసిరకం లేదా అతుకులు ఉన్న సర్వీస్ వైర్లను ఉపయోగించరాదు.
– అడవి జంతువుల వేట కోసం విద్యుత్ వినియోగించడం అత్యంత ప్రమాదకరమైన చర్య. ఇది మీకు, మీ తోటి వారికి ప్రాణహాని కలిగించడమే కాకుండా చట్టరీత్యా నేరం.
ప్రజల అప్రమత్తత, విద్యుత్ భద్రతా నియమాల పట్ల అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ విద్యుత్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.