NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 9:12 pm Posted by : NAMASTHE BHARAT

ఆగష్టు 15న వైకల్య ధ్రువీకరణ పొందిన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి

ఆగష్టు 15న వైకల్య ధ్రువీకరణ పొందిన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి

తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియాతో పాటు కొత్త సర్టిఫికెట్లు ఉన్న వికలాంగులకు మంజూరు చేయాలి

ఆదాయ పరిమితి, షరతులు లేకుండా పెన్షన్లు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి డిమాండ్

నమస్తే భారత్ షాద్ నగర్,ఆగస్టు 9:తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 15న కొత్తగా మంజూరు చేస్తున్న చేయూత పెన్షన్లలో వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందిన వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తే 24.85 లక్షల మంది, 2026 మే నెలలో స్వీకరిస్తే 10.22 లక్షల మంది అప్లై చేసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ మూడోసారి ఆగష్టు 15న కొత్త దరఖాస్తులు స్వీకరించాలని చూడటం సరైంది కాదని, దీనివల్ల మీసేవ కేంద్రాలకు లాభం చేకూరడం తప్ప లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. పాత దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుని పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 32 నెలల కాలంలో 21 రకాల వైకల్యం ఉన్న వేలాది మందికి కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేశారని తెలిపారు. అయితే కేవలం తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు మాత్రమే కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించడం మిగతా వికలాంగులను మోసం చేయడమేనని మండిపడ్డారు. పెన్షన్ల మంజూరు కోసం జూన్ 10న సెర్ప్ కార్యాలయం ముందు, జులై 20న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చేయూత లబ్ధిదారులకు ఆదాయ పరిమితి నిబంధనలు విధించకుండా, ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.