*వాసవి అర్బన్‌లో ఫ్లాట్ల అప్పగింత జాప్యంపై భగ్గుమన్న యజమానులు.. రోడ్డుపై బైఠాయింపు*

నమస్తే భారత్:నిజాంపేట్ విలేకరి
బాచుపల్లి పరిధిలోని ‘వాసవి అర్బన్’ ప్రాజెక్టులో ఫ్లాట్ల అప్పగింతలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కొనుగోలుదారులు కన్నెర్రజేశారు. గత మూడేళ్లుగా తమ సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్నా ఫ్లాట్లను అప్పగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాదాపు 1,800 మందికి పైగా ఫ్లాట్ యజమానులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి బైఠాయించి నిరసన తెలిపారు.
సకాలంలో ఇళ్లు అందిస్తారన్న నమ్మకంతో పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించినప్పటికీ, ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెరా సంస్థ జరిమానా విధించినప్పటికీ, యాజమాన్యం తీరులో మార్పు రాకపోగా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. ఇటీవల ఫ్లాట్ల అప్పగింతలో మరోసారి జాప్యం తప్పదంటూ సంస్థ ఎండీ అభిషేక్ చేసిన వ్యాఖ్యలు తమ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశాయని వారు పేర్కొన్నారు. తమ సమస్యకు వెంటనే స్పష్టమైన పరిష్కారం చూపి, ఫ్లాట్లను తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేశారు.
ట్రాఫిక్‌కు అంతరాయం – పోలీసుల జోక్యం
బాధితుల ఆందోళనతో బాచుపల్లి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఏసీపీ బాల గంగిరెడ్డి, బాచుపల్లి ఇన్‌స్పెక్టర్ దాలి నాయుడు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని నచ్చజెప్పడంతో యజమానులు శాంతించారు. దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు అనంతరం పునరుద్ధరించారు.