NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 2:21 pm Posted by : NAMASTHE BHARAT

చిన్న ఉద్యోగంతో ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

చిన్న ఉద్యోగంతో ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

-బొట్టు బొట్టు నీరు నదిగా మారినట్లే జీవితంలో ఎదగాలని యువతకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు

 

-బహదూర్‌పల్లిలో కేఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా

-దాదాపు 30 ప్రముఖ కంపెనీలతో భారీ ఉపాధి అవకాశాలు

-ఎంపికైన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత

-వృత్తి విద్యతో పాటు ఉపాధి కల్పనలో కళాశాల సేవలు ప్రశంసనీయం

-సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచన

-ప్రభుత్వ వోకేషనల్ విద్యాభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలకు ప్రత్యేక అభినందనలు

 

 

కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్): బొట్టు బొట్టు నీరు కలిసి నదిగా మారినట్లే చిన్న ఉద్యోగంతో కెరీర్‌ను ప్రారంభించిన యువత క్రమంగా అనుభవం, నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో ఉన్న కేఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాల వేదికగా ఇంటర్మీడియట్ వోకేషనల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాల పనిచేస్తుండటం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రతి సంవత్సరం విద్యను అందించడంతో పాటు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని కొనియాడారు. యువత పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. ఇలాంటి జాబ్ మేళాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని అన్నారు. ప్రభుత్వ వోకేషనల్ విద్యాభివృద్ధికి సహకరిస్తున్న జేఈటీఎల్, ఏవీ రావు పవనపుత్ర ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు కార్యక్రమానికి సహకరించిన అన్ని సంస్థలు, దాతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 30 ప్రముఖ కంపెనీలు పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశాయి. అనంతరం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలకు ఎంపికైన నలుగురు విద్యార్థులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ కుషాన్, ఇంటర్మీడియట్ వోకేషనల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీ జోష్నా, ఆర్డీఎస్ఐఈ ఏడీ ఉషేంద్ర, కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర, మల్కాజిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమా, కూకట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య, దాతలు బి. సాయికుమార్, ఏవీ రావు, వెలుగు ట్రస్ట్ వ్యవస్థాపకుడు నారాయణరావు, మాజీ కౌన్సిలర్లు ఎలుగారి సత్యనారాయణ, భరత్, మాజీ సర్పంచ్ కొమురయ్య యాదవ్, సగ్గడి పద్మారావు, నాయకులు సగ్గడి శ్రీనివాస్, నాయి కోటి శ్యామ్, అధ్యాపకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.