సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
→ ‘సురక్షా కా తిరంగా’లో భాగంగా జీడిమెట్ల పోలీసుల అవగాహన కార్యక్రమం
→ ఈక్ఐసీ కంపెనీ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన
→ ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వివరాలు ఎవరికీ వెల్లడించొద్దు
→ ఆన్‌లైన్ లావాదేవీల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష
→ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి
→ ఎంఆర్ఎం, జీఆర్ఎం సేవలపై ఉద్యోగులకు అవగాహన
→ సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలి: జీడిమెట్ల పోలీసులు
జీడిమెట్ల, ఆగస్టు 12: ( నమస్తే భరత్ ); సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జీడిమెట్ల పోలీసులు సూచించారు. ‘సురక్షా కా తిరంగా’ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని టీఎస్ఐసీ కాలనీలో ఉన్న ఈక్ఐసీ కంపెనీలో సైబర్ కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్ఓ రవి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐ ధనుంజయ, ఎస్ఐ ప్రేమ్ సాగర్, పీసీలు నరేష్, సుబ్బారెడ్డి, డబ్ల్యూపీసీ నాజియా పాల్గొన్నారు. కంపెనీ ఉద్యోగులతో పోలీసులు నేరుగా మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు, సోషల్ మీడియా ఆధారిత నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని పోలీసులు సూచించారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, అనుమానాస్పద లింకులు, నకిలీ గుర్తింపులతో వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్‌కు స్పందించి మోసపోవద్దని హెచ్చరించారు.
తక్షణమే 1930కు సమాచారం
సైబర్ ఆర్థిక మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి అందుబాటులో ఉన్న మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (MRM), గ్రీవెన్స్ రెడ్రెసల్ మాడ్యూల్ (GRM) గురించి కూడా ఉద్యోగులకు వివరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఖాతాలు, మోసపూరిత ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగులు చురుకుగా పాల్గొని సైబర్ నేరాల నివారణకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.