NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:37 pm Posted by : NAMASTHE BHARAT

రాష్ట్ర క్రీడా అకాడమీల ప్రవేశాలకు నోటిఫికేషన్

రాష్ట్ర క్రీడా అకాడమీల ప్రవేశాలకు నోటిఫికేషన్

జూలై 20 నుంచి 28 వరకు ప్రతిభా ఎంపికలు ప్రారంభం

ప్రతిభావంతులైన బాలబాలికలకు సువర్ణావకాశం

2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఎంపికల షెడ్యూల్ విడుదల

వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రవేశావకాశం

బాలురు, బాలికలకు వేర్వేరు కేంద్రాల్లో ఎంపిక పరీక్షలు

వయోపరిమితి ప్రకారం క్రీడాకారులకు అవకాశం

ఉచిత శిక్షణ, వసతి, విద్యా సౌకర్యాలు అందజేత

అసలు ధ్రువపత్రాలతో నిర్ణీత తేదీల్లో హాజరు కావాలని అధికారుల సూచన

కుత్బుల్లాపూర్, జూలై 17 ( నమస్తే భారత్ ): తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతి గృహాల్లో ప్రవేశాల కోసం ప్రతిభా ఎంపికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచే బాలబాలికలను గుర్తించి అత్యున్నత స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఎంపికలను చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి నాణ్యమైన శిక్షణతో పాటు ఉచిత వసతి, పోషకాహారం, విద్యా సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. సైక్లింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ తదితర క్రీడాంశాల్లో ప్రతిభా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా క్రీడలకు సంబంధించి హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, ములుగు, మహబూబ్‌నగర్, సూర్యాపేట, గచ్చిబౌలి, ఎన్టీఆర్ స్టేడియం తదితర కేంద్రాలను ఎంపిక కేంద్రాలుగా నిర్ణయించారు. జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ క్రీడలకు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు, అథ్లెటిక్స్, వాలీబాల్, హాకీ, కబడ్డీ, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, రెజ్లింగ్, సైక్లింగ్ క్రీడలకు 14 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు, సూర్యాపేట వాలీబాల్ అకాడమీకి 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులని అధికారులు తెలిపారు.

ధ్రువపత్రాలు తప్పనిసరి

ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు పాఠశాల లేదా కళాశాల బోనాఫైడ్ ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, పది పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు మరియు ఇతర అవసరమైన ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.

నిర్ణీత తేదీల్లో హాజరు కావాలి

ప్రతి క్రీడకు వేర్వేరు తేదీలు, కేంద్రాలు నిర్ణయించినందున అభ్యర్థులు సంబంధిత షెడ్యూల్‌ను పరిశీలించి నిర్ణీత సమయానికి హాజరు కావాలని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు కోరారు. పూర్తి వివరాల కోసం జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.