NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 12:18 pm Posted by : NAMASTHE BHARAT

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేదు అధికారులకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ స్పష్టమైన ఆదేశాలు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేదు
అధికారులకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ స్పష్టమైన ఆదేశాలు


-ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వేగవంతమైన చర్యలు చేపట్టాలి

-ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారం చేయాలి

-తిరస్కరణకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలి

-స్వీకరించిన అర్జీలపై చర్యల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

-ప్రజావాణిలో 78 వినతులు స్వీకరణ

-డీఆర్వో మాలతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి అర్జీల స్వీకరణ

కుత్బుల్లాపూర్, జూలై 13 ( నమస్తే భరత్ ): ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 78 దరఖాస్తులను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్వో మాలతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో సమయం, ధనం వెచ్చించి ప్రజావాణికి వస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి అధికారిపై ఉన్న బాధ్యత అని అన్నారు. అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సి వచ్చిన సందర్భంలో అందుకు గల కారణాలను స్పష్టంగా, పూర్తి వివరాలతో అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అలాగే స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.