నర్సంపేట ‘పెద్ది’ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం

జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు..
నర్సంపేట జులై31 (నమస్తే భారత్ ) : నర్సంపేట నియోజకవర్గంలో గత ముప్పై ఏండ్లుగా ప్రజా జీవితంలో కొనసాగిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారు. విద్యార్థి దశ నుంచే యువజన కార్యకలాపాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పెద్ది తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అనతికాలంలోనే ఉద్యమ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ దృష్టిలో పడ్డారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పజెప్పేవారు. పదవిలోకి వచ్చాక కన్నా రాకముందు నుంచే డివిజన్ ప్రజలతో అనుబంధం కొనసాగింది. తనను సాయం కోరుతూ వచ్చే వాళ్లకు న్యాయం చేయడం, చావు బతుకుల్లో జనాల ఇండ్లకు వెళ్లి కలిసి ధైర్యం చెప్పడం పెద్ది దినచర్యలో భాగం అయింది. బోర్లు, చెరువులపై ఆధారపడుతున్న రైతాంగం సమస్యను చూసి రెండు పంటలు పండేలా చేస్తానని నర్సంపేటకు దేవాదుల నీళ్లు తెప్పించడం, జిల్లాకు పరిమితమయ్యే మెడికల్ కాలేజీ, ఏం.జీ.ఏం తరహా ఆస్పత్రి నర్సంపేటకు తీసుకురావడంలో పెద్ది సక్సెస్ అయ్యాడు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకం అవడం పెద్దిని ప్రతిపక్ష పార్టీలు సైతం గౌరవంగా చూసేలా చేసింది.తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను, ప్రజా సంఘాలను ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా కృషి చేశాడు. ఇంటర్ డిగ్రీ, బీటెక్ తదితర కాలేజీలకు స్వయంగా వెళ్ళి విద్యార్థులకు ఉద్యమం అవసరాన్ని, ఆవశ్యకతను వివరించేవారు. ఈ క్రమంలోనే 2010 లో వరంగల్ గర్జన సభ పెద్ద ఎత్తున నిర్వహించడంలో కీలక పాత్ర పెద్ది పోషించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సభ ఏర్పాట్లు, కార్యకర్తల సమీకరణ లో ముందుండి పని చేశాడు. లక్షల సంఖ్యలో జనాలు ఈ సభకు హాజరయ్యారు. అప్పటికే ఊపు మీద ఉన్న ఉద్యమానికి ఈ కసభమరింత ఉత్సాహం నింపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ బలపడటానికి కారణమైంది. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించి వరంగల్ లో జరిగే కీలక పనులను కేసీఆర్ పెద్దికి అప్పజెప్పేవారు. అధినేత కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
*రాజకీయ అరంగేట్రం*…
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రం పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం. 1974 ఆగస్టు 6 న పెద్ది జన్మించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్.ఎస్.యూ.ఐ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాడు. తర్వాత యూత్ పార్టీలో చేరారు. అనంతరం యువజన కాంగ్రెస్, మండల కాంగ్రెస్, దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశాడు. రాజకీయ ఉద్దండుడు ఓంకార్ ఏం.సీ.పీ.ఐ పార్టీ నేతను ఎదురొడ్డి నిలిచాడు. ప్రాణహాని ఉన్నందున ప్రభుత్వం అతనికి గన్ లైసెన్స్ మంజూరు చేసింది. అనంతరం 1998లో ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు తీసుకున్నాడు. ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడుతున్న తరుణంలో 2001 నుంచే ఆ పార్టీలో చేరి పోటీ చేసి నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. జెడ్సీ ఫ్లోర్ లీడర్ గా సేవలందించారు. అనంతరం 2004లో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్, 2005లో రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 2013 వరకు పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.అనంతరం జిల్లా ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచాడు. మహాగర్జన సభతో పాటు అనేక ఉద్యమ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. కేసీఆర్ నిరాహార దీక్ష అనంతరం ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో ముందుండి పనిచేశారు. 2014లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వెనుకడుగు వేయలేదు. ప్రజల మధ్యే ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.
ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో
ఓటమి చెందినప్పటికీ ప్రజా జీవితంలో చురుగ్గా పని
చేస్తున్నారు. నర్సంపేట రాజకీయాల్లో గెలుపు
ఓటములతో సంబంధం లేకుండా ప్రజా క్షేత్రంలో
ఉన్న నేతగా పెద్దికి పేరుంది.