NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 10:25 pm Posted by : NAMASTHE BHARAT

బౌరంపేట్ బతుకమ్మ గ్రౌండ్ పునరుద్ధరణకు చర్యలు

బౌరంపేట్ బతుకమ్మ గ్రౌండ్ పునరుద్ధరణకు చర్యలు

-ఆక్రమణలు తొలగించి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెస్తామని కొలన్ హన్మంత్ రెడ్డి హామీ

-మహిళల కోసం షెడ్ ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చిస్తామని వెల్లడి

-కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడతామన్న కాంగ్రెస్ ఇంచార్జి

-స్థానికుల వినతిపై ప్రాంతాన్ని పరిశీలించిన హన్మంత్ రెడ్డి

బౌరంపేట్, జూన్ 30 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ పరిధి ఇందిరమ్మ కాలనీలో మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు కేటాయించిన గ్రౌండ్‌ను పునరుద్ధరించి, అక్కడ శాశ్వత షెడ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని కోరారు. గ్రౌండ్‌లో కొందరు అనధికారికంగా షెడ్లు నిర్మించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కొలన్ హన్మంత్ రెడ్డి మంగళవారం సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బతుకమ్మ వంటి సాంప్రదాయ పండుగల నిర్వహణ కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రౌండ్‌పై ఉన్న ఆక్రమణలను తొలగించి తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే మహిళలు, స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ షెడ్ ఏర్పాటు చేయించే అంశాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న ఇతర సమస్యలపైనా ఆయన స్పందించారు. వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి తదితర మౌలిక వసతుల కల్పనకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ వాసులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇతరులు పాల్గొన్నారు.