NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 5:05 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడ లో పట్టుబడిన గంజాయి రవాణా

మరిపెడ లో పట్టుబడిన గంజాయి రవాణా ముఠా.రూ.1.12 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.

నమస్తే భారత్ :-మరిపెడ

ఒడిశా నుంచి నల్గొండ జిల్లాకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను మరిపెడ పోలీసులు పట్టుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ 1.12 లక్షల విలువైన 2 కిలోల 240 గ్రాముల ఎండు గంజాయి, ఒక మారుతీ సుజుకీ బాలేనో కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం.మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్, సిబ్బంది ఇస్లావత్ రవీందర్, రమేష్, వెంకన్న, మహిళా కానిస్టేబుల్ శాంతతో కలిసి పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న మారుతీ సుజుకీ బాలేనో కారును ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ పోలీసులను గమనించి తప్పించుకునేందుకు వేగం పెంచాడు. అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా డ్రైవర్ సీటు కింద గంజాయి ప్యాకెట్ లభించింది.తనిఖీల్లో కారులో మొత్తం 2 కిలోల 240 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారులో ఉన్న గండికోట వంశీ (24), చిత్రం రాకేష్ (22), చింతల తిరుమలేష్ (24), కంచి మహేష్ (25), మాదాసు మహేష్ (26) లను అదుపులోకి తీసుకుని విచారించగా, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్గొండలో సెల్ఫ్ డ్రైవ్‌కు కారును అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, నల్గొండ జిల్లాలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, బాలేనో కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదును కోర్టు ముందు హాజరుపరిచేందుకు స్వాధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.