NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 12:29 pm Posted by : NAMASTHE BHARAT

ఖానాపురంలో చిరుత పులి కలకలం

ఖానాపురంలో చిరుత పులి కలకలం

భయాందోళనలో ప్రజలు

ఖానాపురం జూన్ 28(నమస్తే భారత్ ) :
ఖానాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫామాయిల్ తోటలో అదివారం ఉదయం చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మనుబోతులగడ్డ, పోచారం అటవీ ప్రాంతాల నుంచి నక్కల వర్రే కాలువ వెంబడి పులి వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తికి చిరుత పులి కనిపించినట్లు సమాచారం. పామాయిల్ తోట సమీపంలోని రైస్ మిల్ సీసీ కెమెరాలో చిరుత సంచరించినట్లు రికార్డ్ అయింది.ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో గ్రామంతో పాటు మండలంలోని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
చిరుత పులి సంచారం సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత పులి కనిపించినట్లు చెబుతున్న ప్రాంతంలో పాదముద్రలు, ఇతర ఆనవాళ్ల కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు ,ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు. చిరుత సంచారం ఖానాపురం, రాగంపేట, పరిసర గ్రామాల భయాందోళనలు నెలకొన్నాయి.

*అప్రమత్తంగా ఉండాలి* :
*నర్సంపేట ఎఫ్ ఆర్ ఓ నరేష్*

నర్సంపేట రేంజ్ పరిధిలోని ఖానాపూర్ మండలంలో, గూడూరు వన్యప్రాణి విభాగానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో చిరుతపులి సంచారం ఉన్నట్లు సమాచారం అందిందని నర్సంపేట ఎఫ్ ఆర్ ఓ నరేష్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అడవి ప్రాంతాలలో పశువులు, గొర్రెలను మేపడానికి అనుమతించకూడదు. మహిళలు మరియు పిల్లలు సాయంత్రం ఆలస్య సమయంలో మరియు రాత్రివేళల్లో ఒంటరిగా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎవరైనా చిరుతపులి సంచారాన్ని గమనించినట్లయితే, దానికి ఎలాంటి హాని కలిగించకుండా వెంటనే అటవీ శాఖ 1926 టోల్ ఫ్రీ నెంబరుకు గాని , పోలీసు శాఖ 100 నెంబరు కు సమాచారం అందించాలన్నారు. వన్యప్రాణులకు హాని కలిగించడం లేదా వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 నిబంధనలను ఉల్లంఘించడం చట్టపరమైన చర్యలకు దారి తీస్తుంది.