NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 9:40 am Posted by : NAMASTHE BHARAT

వొక్షిత్ ఎన్‌క్లేవ్‌లో ప్రజా సమస్యలపై కూన శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయి పరిశీలన

వొక్షిత్ ఎన్‌క్లేవ్‌లో ప్రజా సమస్యలపై కూన శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయి పరిశీలన

-తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలపై స్థానికుల వినతులు

-అధికారులతో కలిసి కాలనీలో విస్తృతంగా పర్యటించిన డీసీసీ ఉపాధ్యక్షులు

-సీసీ రోడ్లు, నాలా పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం

-ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్న కూన శ్రీనివాస్ గౌడ్

-సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని హామీ

కుత్బుల్లాపూర్, జూలై 4 ( నమస్తే భరత్ ): గాజులరామారం డివిజన్ పరిధిలోని వొక్షిత్ ఎన్‌క్లేవ్–1, వొక్షిత్ ఎన్‌క్లేవ్–2 కాలనీలలో నెలకొన్న తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, నాలా పునరుద్ధరణ తదితర సమస్యలను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక వాటర్ వర్క్స్ డీజీఎం రవీందర్, సీఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి కాలనీలో పర్యటించిన ఆయన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్థానికులు అందజేసిన వినతులను స్వీకరించి, ముఖ్యంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అదేవిధంగా నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. నాలా పునరుద్ధరణ అంశాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కూన శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడం ప్రజాప్రతినిధులు, అధికారుల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. కాలనీల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి, కాలనీ ప్రతినిధులు గోపాల్ రెడ్డి, సూరపు రాజు, శ్రీకాంత్ రెడ్డి, వల్లెపు వేణు, అంజన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.