*జాడి మాధవరావుకు సేవారత్న పురస్కారం…*
*-రెండు దశాబ్దాలుగా నిరుపేద చిన్నారులకు ఆశ్రయం..*
*-అనాథ చిన్నారుల సేవకు అరుదైన గుర్తింపు..*
*-విద్యతో భవిష్యత్తుకు భరోసా*
*కరకగూడెం నమస్తే భారత్ నవంబర్ 14:* అనాథ చిన్నారులకు అండగా నిలుస్తూ,విద్య ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జాడి మాధవరావుకు సేవారత్న పురస్కారం లభించింది.ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం రాయిగూడ గ్రామంలోని ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో సామ్రాట్ అశోక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన దండారి–గుస్సాడి ఉత్సవాల్లో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ మాధవరావును ఘనంగా సత్కరించి అవార్డును అందజేశారు.సేవనే జీవిత ధ్యేయంగా ఎంచుకున్న మాధవరావు 2003 నుంచి ‘ఆదరణ’ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ తల్లిదండ్రుల ఆదరణకు దూరమైన చిన్నారులకు ఆశ్రయంతోపాటు ఆప్యాయతను అందిస్తున్నారు.వారికి మంచి భవిష్యత్తును కల్పించాలనే సంకల్పంతో 2017 నుంచి ‘అమితాభ ఆదరణ విద్యాలయ’ పేరుతో పాఠశాలను కూడా నిర్వహిస్తూ విద్యాసేవ కొనసాగిస్తున్నారు.రెండు దశాబ్దాలకు పైగా ఆయన చేస్తున్న సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.అనాథ చిన్నారులకు ఆశ్రయం కల్పించి,విద్యతో వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న మాధవరావుకు లభించిన ఈ పురస్కారం ఆయన సేవా నిరతికి తగిన గుర్తింపుగా పలువురు అభినందిస్తున్నారు.కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అశోక్ ముస్సాపురే, గిరిజన పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత,పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.