ఐపీ చానళ్ళకు అక్రెడిటేషన్లు లేవు
:
తేల్చి చెప్పిన మంత్రి పొంగులేటి
: జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు త్వరలో ఇస్తాం
హైదరాబాద్,అక్టోబర్ 24 (మల్లేష్ నమస్తే భారత్) : రాష్ట్రం కేబుల్ టీవీల స్థానంలో నడుస్తున్న ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్(ఐపీ) ఛానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడం కుదరదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికే 26 వేల అక్రెడిటేషన్ కార్డులిచ్చామని,గతంలో కంటే నాలుగు వేల కార్డులు ఎక్కువే ఇచ్చామని, గతంలో లేని ఐపీ చానళ్ళకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులివ్వలేమని ఆయన స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నేతృత్వంలో కేబుల్ చానల్స్ ప్రతినిధులు,
పలువురు ఫెడరేషన్ నాయకులు సచివాలయంలో మంత్రి పొంగులేటి ని కలిసి కేబుల్ ఐపీ చానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్శస్థలాలు, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు కేటాయించి, సొంతంటి కలను సాకారం చేస్తామని మంత్రి అన్నారు. జర్నలిస్టులకు గతంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలు పునరావృతం కాకుండా, చట్టపరమైన చిక్కులు లేని విధంగా ఇళ్ల స్థలాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇళ్ళస్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వడం జరిగిందని మరోసారి కాంగ్రెస్ పాలనలోనే ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతోపాటు, వారికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ కూడా పారదర్శకంగా కొనసాగుతుందని, గత ప్రభుత్వం కేవలం 21వేల అక్రెడిటేషన్లు ఇస్తే… తమ ప్రజా ప్రభుత్వం ఇప్పటికే 26వేల అక్రెడిటేషన్లు ఇచ్చిందని చెప్పారు. అక్రెడిటేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు ఇస్తామని మంత్రి అన్నారు. అంతకుముందు
ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య మంత్రితో మాట్లాడుతూ, రాష్ట్రంలో కొన్నేళ్ళుగా కేబుల్ నెట్వర్క్ ద్వారా నడిచిన అనేక న్యూస్ చానళ్ళు ప్రస్తుతం మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఐపి ద్వారా నడుస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఐపీ టీవీ న్యూస్ ఛానళ్ళకు కూడా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఎంతోమంది జర్నలిస్టులు ఇళ్ళస్థలాల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదిరిచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళస్థలాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు జారీ చేయాలని, అరవై ఏళ్ళ వయసు పైబడి సీనియర్ పాత్రికేయులకు పెన్షన్ స్కీం అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కుంచం శ్రీనివాస్, రవికుమార్, జాతీయ కౌన్సిల్ మెంబర్ బి.మల్లేష్ గౌడ్ , కేబుల్ చానెల్ అసోసియేషన్ ప్రతినిధులు సుభాష్, భరత్, శ్రీరాములు, షఫియుద్దీన్, ప్రతాప్, రాచర్ల గోపి, సుధాకర్, విజ్ఞేష్ గౌడ్ తదిరులున్నారు.