*బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’*

*బీసీ మహిళల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్*
*కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 13:బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వంలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి, వారిని కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12,000 కాగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ఈనెల 18వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల్లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్,బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయా దేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు,అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.