NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 9:23 pm Posted by : NAMASTHE BHARAT

ఓటర్లకు కీలక సూచన… ఫారాలు వెంటనే సమర్పించండి

ఓటర్లకు కీలక సూచన… ఫారాలు వెంటనే సమర్పించండి

-ఎస్ఐఆర్–2026 ప్రత్యేక సవరణలో వేగం

-బీఎల్‌వోలు అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలు రెండు, మూడు రోజుల్లో అప్పగించాలి

-గడువులోగా సమర్పించిన వారికే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో స్థానం

-ఆలస్యం చేస్తే ఓటరు జాబితాలో పేరు కోల్పోయే అవకాశం

-దుండిగల్ సర్కిల్ ఓటర్లకు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ విజ్ఞప్తి

దుండిగల్, జులై 11 ( నమస్తే భరత్ ) : ఓటు హక్కును పరిరక్షించుకోవాలంటే బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలను నిర్దేశిత గడువులోపు తప్పనిసరిగా సమర్పించాలని దుండిగల్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్ఓ) డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఈ సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ఎస్ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తనకు అందిన ఫారాన్ని పూర్తిగా, సరైన వివరాలతో నింపి, వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లోపు సంబంధిత బీఎల్‌వోకు అందజేయాలని సూచించారు. ఫారాల్లో నమోదైన వివరాల ఆధారంగానే డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపొందించబడుతుందని అధికారులు తెలిపారు. గడువులోగా సరైన వివరాలతో ఫారాలు సమర్పించిన వారి పేర్లనే డ్రాఫ్ట్ జాబితాలో చేర్చనున్నట్లు స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేసి ఫారాలు సమర్పించని వారి పేర్లు జాబితాలో లేకపోయే అవకాశముందని హెచ్చరించారు. దుండిగల్ సర్కిల్ పరిధిలోని ప్రతి ఓటరు ఈ ప్రక్రియను బాధ్యతగా తీసుకుని తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు వెంటనే స్పందించాలని డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ కోరారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఓటర్లకు బీఎల్‌వో వివరాలు తెలుసుకోవాలన్నా, నమోదు ప్రక్రియపై సందేహాలు ఉన్నా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.