చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పచ్చదనానికి శ్రీకారం


మేధా సర్వో డ్రైవ్స్‌లో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్
◆ పరిశ్రమల్లో పచ్చదనం పెంపుతో కాలుష్య నియంత్రణ సాధ్యం
◆ ప్రతి మొక్కను సంరక్షించడం అందరి బాధ్యత: అదనపు కలెక్టర్
◆ పర్యావరణ పరిరక్షణలో పరిశ్రమలు సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి
◆ వనమహోత్సవం వంటి కార్యక్రమాల్లో పరిశ్రమల చురుకైన భాగస్వామ్యం అవసరం
◆ పరిశ్రమల శాఖ–ఫ్యాక్టరీల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కల నాటకం
◆ అధికారులు, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగుల ఉత్సాహభరిత భాగస్వామ్యం
కుత్బుల్లాపూర్, జూలై 31 ( నమస్తే భరత్ ): పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని విస్తరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ పేర్కొన్నారు. ఐడీఏ చర్లపల్లి ఫేజ్–2లోని మేధా సర్వో డ్రైవ్స్ లిమిటెడ్ ప్రాంగణంలో పరిశ్రమల శాఖ, ఫ్యాక్టరీల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రణాళికాబద్ధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం అత్యంత అవసరమన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను ప్రతి సంస్థ, ప్రతి ఉద్యోగి స్వీకరించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పరిశ్రమల యాజమాన్యాల పాత్ర కీలకమని పేర్కొన్న అదనపు కలెక్టర్, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా వనమహోత్సవం వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు పచ్చదనానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ & జనరల్ మేనేజర్ డి. వినయ్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మనోహర్ రెడ్డి, ఫ్యాక్టరీల శాఖ ప్రతినిధి శ్రీవిద్య, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రఘునాథ్, మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని సంకల్పించారు.