NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 10:39 pm Posted by : NAMASTHE BHARAT

తెలంగాణ ఉద్యమ దిక్సూచికి ఘన నివాళులు

తెలంగాణ ఉద్యమ దిక్సూచికి ఘన నివాళులు

వర్ధంతి సందర్భంగా జయశంకర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలు చిరస్మరణీయం

మూడు దశల ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహోన్నత నాయకుడు

జయశంకర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని బీఆర్ఎస్ నాయకుల స్పష్టం

పేట్ బషీరాబాద్, నమస్తే భారత్:
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను జీవితాంతం ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత ఉద్యమ నేత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పేట్ బషీరాబాద్ డివిజన్ పరిధిలోని జయశంకర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1952 నుంచి తన చివరి శ్వాస వరకు ప్రొఫెసర్ జయశంకర్ నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం మూడు దశల్లో సాగిన ప్రతి సందర్భంలోనూ ఆయన కీలక పాత్ర పోషించి ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించారని గుర్తుచేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ప్రముఖ విద్యావేత్తగా, సామాజికవేత్తగా, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా నదీ జలాల అసమాన పంపిణీ, ఉద్యోగాలు, వనరుల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ఆయన చేసిన లోతైన అధ్యయనాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి బలమైన పునాదిగా నిలిచాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. జయశంకర్ ఆశయాలను కొనసాగించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్‌తో పాటు పార్టీ నాయకులు యాదగిరి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు కిషోర్ చారి, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకుడు నజీర్, రాకేష్, దిలీప్, ఉమేష్, ఆంజనేయులు, రమణారెడ్డి, వెంకటేష్, అజయ్, రవీందర్, గంగాధర్, సతీష్, పోచయ్య, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.