నిస్వార్థ ప్రజా కళాకారుడు నాగన్నకు ఘన నివాళి
-జగద్గిరిగుట్టలో సీపీఐ ఆధ్వర్యంలో సంతాప సభ
-ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు
-ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసిన అరుదైన కళాకారుడు: ఉమా మహేష్
-తెలంగాణ ఉద్యమంలో నాగన్న పాటలు చిరస్మరణీయం
-ప్రజా ఉద్యమాలకు ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్య
పలువురు నాయకులు, కళాకారుల నివాళులు
జగద్గిరిగుట్ట, జూలై 4 ( నమస్తే భరత్ ): ప్రముఖ అరుణోదయ కళాకారుడు, ప్రజా గాయకుడు నాగన్న మృతికి సంతాపంగా శనివారం జగద్గిరిగుట్టలోని సీపీఐ కార్యాలయం వద్ద ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రతి పల్లెలో, ప్రతి ప్రజా ఉద్యమంలో, సామాజిక కార్యక్రమాల్లో వినిపించిన పాటల్లో నాగన్న గాత్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజల సమస్యలపై చైతన్యం కల్పించేందుకు జీవితాంతం తన గాత్రాన్ని అంకితం చేసిన ప్రజా కళాకారుడిగా ఆయన నిలిచిపోయారని కొనియాడారు.
డబ్బు, ఆస్తుల కోసం కాకుండా ప్రజల కోసమే నిస్వార్థంగా పాటలు పాడుతూ జీవితాన్ని అర్పించిన అరుదైన వ్యక్తి నాగన్న అని ఉమా మహేష్ పేర్కొన్నారు. కోరుకుంటే కోట్లాది రూపాయల సంపదను కూడబెట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా సేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని అన్నారు. నాగన్న మరణం ప్రజా ఉద్యమాలకు, సాంస్కృతిక రంగానికి, ప్రజాకళలకు తీరని లోటని పేర్కొంటూ, ఆయన పాటలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఉమా మహేష్ అన్నారు. ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు, జర్నలిస్టు నాయకులు, కళాకారుడు డప్పు రామస్వామి, తొండ వెంకట్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అరవింద్, సాయి, యువజన నాయకుడు కీర్తి, సీపీఐ నాయకులు జానకిరామ్, నారాయణ, శివారెడ్డి తదితరులు పాల్గొని నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.