విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన డిప్యూటీ కమిషనర్ వి. నర్సింహాకు ఘన వీడ్కోలు

-సుచిత్ర స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో సన్మాన సభ.. సహోద్యోగుల భావోద్వేగ వీడ్కోలు
-నిజాయితీ, కర్తవ్యనిష్ఠ, ప్రజాసేవకు ప్రతీకగా కొనియాడిన అధికారులు
కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో సేవలందించి, గతంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించిన సీనియర్ అధికారి వి. నర్సింహా మంగళవారం పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో సర్కిల్‌కు బదిలీపై వెళ్లిన ఆయన, అక్కడ కొద్ది రోజులపాటు విధులు నిర్వహించిన అనంతరం పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో జీడిమెట్ల సర్కిల్ పరిధి సుచిత్రలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో ఘనంగా వీడ్కోలు, సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడిమెట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి. శంకర్ సింగ్ హాజరై మాట్లాడుతూ, వి. నర్సింహా విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావం ప్రతి ఉద్యోగికి ఆదర్శమని కొనియాడారు. ఉద్యోగ జీవితమంతా నిజాయితీతో విధులు నిర్వర్తించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జీడిమెట్ల, గాజులరామారం, చింతల్ సర్కిళ్లకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నర్సింహాను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. పలువురు అధికారులు మాట్లాడుతూ, వి. నర్సింహా తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో కర్తవ్యనిష్ఠ, నిజాయితీ, సేవాభావంతో విధులు నిర్వహించి సహోద్యోగుల అభిమానాన్ని పొందారని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలు సంస్థకు చిరస్మరణీయంగా నిలుస్తాయని కొనియాడారు. కార్యక్రమం అనంతరం అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదవీ విరమణ జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.