NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:59 pm Posted by : NAMASTHE BHARAT

చిన్నపాటి వర్షాలకే చిటికి మాటికి విద్యుత్ అంతరాయం

చిన్నపాటి వర్షాలకే చిటికి మాటికి విద్యుత్ అంతరాయం


వాడి వేడిగా సాగిన పాపన్నపేట మండల సమీక్ష సమావేశం
* పలు అధికారుల తీరుపై ఆగ్రహించిన సర్పంచులు
పాపన్నపేట, ఆగస్టు 13 (నమస్తే భారత్): మండల కేంద్రమైన పాపన్నపేటలో గురువారం నిర్వహించిన గ్రామఅభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశం వాడీ వేడిగా సాగింది.మెదక్ డిపిఓ యాదయ్య,ఎంపీడీవో విష్ణువర్ధన్ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పలు శాఖల అధికారులు ఫోన్ చేస్తే స్పందించడం లేదని,సమస్య పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని పలు గ్రామాల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యుత్తు శాఖ ఏఈ,లైన్మెన్ లు గ్రామంలో ఉండటం లేదని,సమస్య ఉందని ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఆగ్రహించారు.చిన్నపాటి వర్షం వస్తే గ్రామంలో కరెంటు పోతుందని వారు దుయ్యబట్టారు.దీంతో పాటు చిన్న చిన్న గ్రామాలకు సైతం రూ. లక్షల్లో కరెంట్ బిల్లు వస్తే ఎలా చెల్లించాలని ప్రశ్నించారు.కుర్తివాడ గ్రామంలో 5 వార్డులకు మిషన్ భగీరథ నీరు రావడంలేదని,సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని గ్రామ సర్పంచ్ చెట్టుకింది శ్రీధర్ ఆరోపించారు.పాపన్నపేట, రామతీర్థం గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రతరంగా ఉందని,నూతన ట్యాంకులు నిర్మించి పైపులైను వేసి సమస్య పరిష్కరించాలని సర్పంచులు పావని నరేందర్ గౌడ్,సాయి రెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో 699 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా,173 ఇండ్లు పూర్తయ్యాయని, మిగతావి ప్రోగ్రెస్ లో ఉన్నాయన్నారు. ఏడుపాయల కమాన్, యూసఫ్ పేట,కొత్తపల్లి బ్రిడ్జ్,ఎల్లాపూర్ బ్రిడ్జ్ వద్ద వర్షం కురిస్తే రహదారిపై ప్రయాణించలేని పరిస్థితి ఉందని సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకుపోగా,సమస్య పరిష్కరించడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆర్ అండ్ బీ అధికారి పేర్కొన్నారు. ముఖ్యంగా దాలాపూర్ గ్రామంలో పలు రైతులకు భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడంతో యూరియా కు నానా పాట్లు పడుతున్నామన్నారు. అట్టి భూములకు సంబంధించి కోర్టు కేసులు ఉండడంతో సమస్య ఉందని అధికారి వెల్లడించారు. మండలంలో మొత్తం 26,456 ఎకరాలు సాగులో ఉండగా, అందులో 26,212 ఎకరాల్లో వరి సాగు చేశారని,మిగతా వాటిలో పత్తి, కంది, పెసరు, చెరుకు,కూరగాయలు పండిస్తున్నారని ఏవో పి.శ్రీనివాస్ రాజు పేర్కొన్నారు. ఏడుపాయల కమాన్ నుంచి ఏడుపాయల వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, మండలంలోని పలు గ్రామాలకు సైతం రహదారి నిర్మాణాలకు నిధులు కేటాయించబడిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. హమ్ గ్రాండ్ కింద సైతం పలు గ్రామాల్లో రహదారులు నిర్మించనున్నామని పేర్కొన్నారు.రామతీర్థం లోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు లేక మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ సాయిరెడ్డి సభ దృష్టికి తీసుకెళ్ళగా, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. గ్రామంలో చాలా మందికి జాబ్ కార్డులు లేవని సర్పంచులు ఇన్చార్జి ఏపిఓ యాదగిరి దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఆర్టీసీ అధికారులు మినహా మిగతా శాఖల అధికారులు పూర్తిస్థాయిలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సతీష్ కుమార్,ఆయా గ్రామాల సర్పంచులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.