పేదలకు వరంగా ఉచిత వైద్య శిబిరం

-మగ్దమ్‌నగర్‌లో ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
-శిబిరాన్ని ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్
-స్వచ్ఛంద సంస్థ, వైద్యుల సేవలను అభినందించిన మాజీ కార్పొరేటర్
-వందలాది మంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం
జగద్గిరిగుట్ట, జూన్ 30 ( నమస్తే భారత్ ) :జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దమ్‌నగర్‌లో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ నివాస కార్యాలయం వద్ద జీఎల్ఆర్ఏ ఇండియా ఆధ్వర్యంలో, మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి వైద్యుల బృందం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుపేదలు అధికంగా నివసించే బస్తీల్లో తరచూ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వల్ల అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. శిబిరం నిర్వహించిన జీఎల్ఆర్ఏ ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, సహకరించిన మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి వైద్యుల బృందానికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వైద్యుల బృందం మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహం పరీక్షలతో పాటు వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు తదితర సాధారణ ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు డా. సంజయ్ కుమార్, డా. సౌజన్య, స్నేహ, శివాని పాల్గొన్నారు. అలాగే మాజీ అధ్యక్షుడు రుద్రా అశోక్, మల్లేష్ గౌడ్, కొలుకుల జైహింద్, వేణు యాదవ్, పాపిరెడ్డి, సీహెచ్ దాసు, ప్రభాకర్, హనుమంతు, విట్టల్ గౌడ్, రాయి రాజేష్, సునీల్ రెడ్డి, సంపత్ రెడ్డి, జై మల్లేష్, సబిత, ఉమారాణి, సతీష్ తదితరులు పాల్గొని శిబిరం విజయవంతానికి సహకరించారు.