NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 9:45 pm Posted by : NAMASTHE BHARAT

తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

దుగ్గొండి సీఐ శంకర్ రావు

నర్సంపేట నవంబర్ 11( నమస్తే భారత్ ) :
పాఖాల చెరువులో తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు దుగ్గొండి సీఐ
జె. శంకర్ రావు తెలిపారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్ తో హసన్ పర్తి మండలం బైరాన్ పల్లికి చెందిన కల్లెబోయయిన మమతకు 16-04-2021 ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా భర్త సుమన్ వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో నవంబర్ 6న రాత్రి ఎలుకుర్తి హావేలికి చెందిన కొందరు వ్యక్తులు మమత ను దూషించి, బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత నవంబర్ 7న ఉదయం తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఖానాపురం మండలంలోని పాఖాల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతురాలి తల్లి కల్లెబోయిన రజీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భర్త ఈరెల్లి సుమన్‌తో పాటు ఆకునూరి మౌనిక , ఆకునూరి శంకర్, ఆకునూరి రాజు ,ఆకునూరి రఘుపతి మరికొందరి పాత్ర ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈమేరకు ఈరెల్లి సుమన్‌తో పాటు ఆకునూరి మౌనిక , ఆకునూరి శంకర్, ఆకునూరి రాజు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందన్నారు.
కుటుంబ సమస్యలు, వేధింపులు ఎదురైనప్పుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే విచారించి న్యాయం చేస్తామని దుగ్గొండి సీఐ
జె. శంకర్ రావు భరోసా ఇచ్చారు.