NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 2:24 pm Posted by : NAMASTHE BHARAT

ఎంటీఎఆర్ టెక్నాలజీస్‌లో తొలగించిన ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సీఐటీయూ

ఎంటీఎఆర్ టెక్నాలజీస్‌లో తొలగించిన ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సీఐటీయూ

-షాపూర్‌నగర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

-15 ఏళ్లుగా పనిచేస్తున్న 350 మంది కార్మికులకు శాశ్వత ఉద్యోగాల కల్పన డిమాండ్

-కార్మిక చట్టాలను అమలు చేయకుండా యాజమాన్యం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని ఆరోపణ

-ఆందోళన చేసిన కార్మికుల తొలగింపు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనేనని విమర్శ

-కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ హెచ్చరిక

-జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం

కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ); గాంధీనగర్ పారిశ్రామికవాడలోని ఎంటీఎఆర్ టెక్నాలజీస్ సంస్థలో అక్రమంగా విధుల నుంచి తొలగించిన ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుని, వారికి శాశ్వత ఉద్యోగ హోదా కల్పించాలని సీఐటీయూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం షాపూర్‌నగర్ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలగింపునకు గురైన ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులకు సంఘీభావంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి ఐలపురం రాజశేఖర్, కుత్బుల్లాపూర్ మండల కన్వీనర్ కీలుగాని లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎంటీఎఆర్ టెక్నాలజీస్‌లో గత 10 నుంచి 15 సంవత్సరాలుగా సుమారు 350 మంది ఐటీఐ, డిప్లొమా విద్యార్హత కలిగిన కార్మికులు ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని తెలిపారు. అయితే వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా, పదేపదే ఒప్పందాలను పునరుద్ధరిస్తూ శాశ్వత ఉద్యోగ హోదా ఇవ్వకుండా యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. దీంతో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్‌తో గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులను అకారణంగా విధుల నుంచి తొలగించడం, సెటిల్‌మెంట్ పేరుతో నోటీసులు జారీ చేయడం కార్మిక హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నాలను సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. యాజమాన్యం వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, లేనిపక్షంలో జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బొడిగె లింగస్వామి, దేవదానం, కే. శ్రీను, పసుల అంజయ్య, తిమ్మప్ప, కరుణాకర్, భాషా, యాదవ రెడ్డి, ఆంజనేయులు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.