NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 12:07 pm Posted by : NAMASTHE BHARAT

సామాజిక సేవకు ‘ఎక్సలెంట్ అవార్డు–2026’.. కోలా రవీందర్ ముదిరాజ్‌కు ఘన సత్కారం

సామాజిక సేవకు ‘ఎక్సలెంట్ అవార్డు–2026’.. కోలా రవీందర్ ముదిరాజ్‌కు ఘన సత్కారo

-సుజనాన ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో వైభవంగా సకల కళా సమ్మేళనం

-దిల్‌సుఖ్‌నగర్ బాబు జగ్జీవన్‌రామ్ ఆడిటోరియంలో అట్టహాసంగా వేడుకలు

-మాజీ కేంద్ర మంత్రి డా. వేణుగోపాల చారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం

-పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై రవీందర్ సేవలను కొనియాడిన అతిథులు

-విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం

-‘అవార్డు మరింత బాధ్యతను పెంచింది.. ప్రజాసేవలో మరింత చురుకుగా ఉంటా’ – కోలా రవీందర్ ముదిరాజ్

కుత్బుల్లాపూర్, జులై 13 ( నమస్తే భరత్ ) : సుజనాన ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సకల కళా సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎక్సలెంట్ అవార్డు–2026ను సామాజిక, పర్యావరణ సేవల్లో విశేష కృషి చేస్తున్న కోలా రవీందర్ ముదిరాజ్కు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ వేణుగోపాల చారి ముఖ్య అతిథిగా హాజరై అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల చారి మాట్లాడుతూ, సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను గౌరవించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కోలా రవీందర్ ముదిరాజ్ పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, ప్రతి ఇంటి స్థలంలో ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని కొనియాడారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు ఆయన చేస్తున్న ప్రచారం అభినందనీయమని, చిన్నారులకు ఈతపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆయన ఆశయాలు నెరవేరాలని భగవంతుడిని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిన్నారుల కళా ప్రతిభను వెలికితీసే వేదికల అవసరాన్ని ప్రస్తావించిన వేణుగోపాల చారి, ప్రస్తుతం పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. పిల్లలకు ఫోన్లు ఇవ్వడం కంటే నృత్యం, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని, వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ఆర్.ఆర్. పిల్లేకు కూడా ప్రత్యేక అవార్డును అందజేశారు. ఈ వేడుకలో రాజేంద్ర కుమార్ పూనా (ఆర్టిస్ట్), డాక్టర్ సముద్రాల శ్రీదేవి, డాక్టర్ భాగ్యలక్ష్మి రెడ్డి, వీరభోగ వసంతరాయులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, ప్రేక్షకులు కళా ప్రదర్శనలను ఆస్వాదిస్తూ చప్పట్లతో ఆడిటోరియంను మార్మోగించారు. అవార్డు అందుకున్న అనంతరం కోలా రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల ఆశీస్సులతో పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటానని, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. భగవంతుడు తనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు.