నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట, అక్టోబర్ 25 (మల్లేష్ నమస్తే భారత్ ):
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్, నర్సంపేట ఆర్డీవో ఉమారాణితో కలిసి కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్, బోర్‌వెల్ మోటార్ ఏర్పాటు చేయడంతోపాటు మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గతంలో మిషన్ భగీరథ ద్వారా కళాశాలకు నీటి సదుపాయం కల్పించినట్లు గుర్తుచేశారు.
కళాశాల అభివృద్ధికి తన సహకారంతో 50 కంప్యూటర్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సహకరిస్తానని తెలిపారు. అదనపు తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం, కళాశాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రిన్సిపాల్‌కు అభినందనలు :
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ విద్యా, పరిపాలనా రంగాల్లో చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్ పురస్కారం అందుకోవడం కళాశాలకు, నర్సంపేట ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని నెలకొల్పడం, విద్యార్థులను ప్రగతి దిశగా ప్రోత్సహించడంలో ప్రిన్సిపాల్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.