ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేయవద్దు: ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 17:తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐ, ఏటీసీలతో కలిసి డిప్లొమా కోర్సులను అనుసంధానించేలా జారీ చేసిన జీవో నెంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో ఆకాష్ నాయక్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కి మరియు తహసీల్దార్ కి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దశాబ్దాలుగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థను, ఈ కొత్త పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరించడం సరికాదన్నారు. దీనివల్ల ప్రభుత్వ విద్య నిర్వీర్యమై, విద్యార్థులు కార్మికులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌ల ఆధునీకరణ, అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి, జీవోలోని పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.