ePaper
Saturday, August 8, 2026
ePaper
Homeఎడిటోరియల్జవహర్‌నగర్ పీహెచ్‌సీపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యానికి ఉపేక్షించేది లేదు: డా....

జవహర్‌నగర్ పీహెచ్‌సీపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యానికి ఉపేక్షించేది లేదు: డా. కె. ఆనంద్

📰 Generate e-Paper Clip

జవహర్‌నగర్ పీహెచ్‌సీపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ

విధుల పట్ల నిర్లక్ష్యానికి ఉపేక్షించేది లేదు: డా. కె. ఆనంద్

-వైద్యాధికారి గైర్హాజరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డీఎంహెచ్ఓ

-వెంటనే జిల్లా కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం

-టీబీ మొబైల్ ఎక్స్-రే యూనిట్ సేవలపై సమగ్ర సమీక్ష

-ఈ-ఔషధి పోర్టల్, ఔషధ నిల్వలు, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన

-గడువు ముగియనున్న మందులకు ‘నియర్ ఎక్స్‌పైరీ డ్రగ్ కార్నర్’ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

-ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తప్పవు

కుత్బుల్లాపూర్, జులై 23 ( నమస్తే భరత్ ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా. కె. ఆనంద్ జవహర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల నిర్వహణ, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీ సందర్భంగా వైద్యాధికారి డా. విజయ్ చంద్ర గత కొన్ని రోజులుగా విధులకు క్రమం తప్పకుండా హాజరు కాకపోవడంతో పాటు, ప్రజలకు అందించాల్సిన వైద్య సేవల విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నట్లు గుర్తించిన డీఎంహెచ్ఓ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయానికి హాజరై వివరణ సమర్పించాలని ఆయన ఆదేశించారు. అనంతరం క్షయవ్యాధి (టీబీ) నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్న మొబైల్ ఎక్స్-రే యూనిట్ పనితీరును పరిశీలించి, ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందుతున్నాయా అనే అంశంపై సమీక్ష నిర్వహించారు. అలాగే ఫార్మసీ విభాగాన్ని తనిఖీ చేసి ఈ-ఔషధి పోర్టల్‌లో నమోదైన ఔషధ నిల్వలు, పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించారు. అనంతరం మాన్యువల్ స్టాక్ రిజిస్టర్లతో వాటిని సరిపోల్చి ధృవీకరించారు. గడువు ముగియబోతున్న మందుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన డీఎంహెచ్ఓ, ఆసుపత్రిలో ‘నియర్ ఎక్స్‌పైరీ డ్రగ్ కార్నర్’ ఏర్పాటు చేసి, అలాంటి ఔషధాల వినియోగం, నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఫార్మసీ అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డా. కె. ఆనంద్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో ప్రజల సంక్షేమమే అత్యున్నత ప్రాధాన్యమని అన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని గౌరవంగా, ఆప్యాయంగా ఆదరించి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, ఉద్యోగులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, అవసరమైతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి సమయాలను ఖచ్చితంగా పాటించడం, నిర్ణీత యూనిఫామ్‌లో విధులకు హాజరుకావడం, ఆసుపత్రి పరిశుభ్రతను కాపాడడం, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించడం, ప్రభుత్వం నిర్దేశించిన అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్లక్ష్య చర్యలను ఏమాత్రం సహించబోమని, బాధ్యతాయుతమైన సేవలందించడం ద్వారానే ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని డీఎంహెచ్ఓ డా. కె. ఆనంద్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!