NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 9:07 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

మరిపెడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

నాణ్యమైన దర్యాప్తు, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణ, ప్రజాకేంద్రీకృత పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి.

-జిల్లా ఎస్పీ డా. శబరీష్.

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, బుధవారం మరిపెడ పోలీస్ స్టేషన్ను సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని స్టేషన్ రికార్డులు, సీడీ ఫైళ్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, వివిధ గదులు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. మరిపెడ ఎస్ఐతో పెండింగ్ ఫైళ్లు, దర్యాప్తులో ఉన్న కేసులు, విచారణ నివేదికల తయారీ, వాటి నాణ్యత, సమయపాలనపై సమీక్ష నిర్వహించి, ప్రతి కేసులో చట్టపరమైన విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై వారి విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తో ప్రత్యేకంగా మాట్లాడి, గ్రామాల్లో ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని, నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి పోలీసులకు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే దర్యాప్తు అధికారులు ప్రతి కేసుకు సంబంధించిన విచారణ నివేదికలను సమగ్రంగా, వాస్తవాధారాలతో సిద్ధం చేయాలని, ఫైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో, పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధులు వంటి బాధితులకు ప్రత్యేక ప్రాధాన్యతతో స్పందించాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలపై అప్రమత్తంగా వ్యవహరించి, నేరాల నియంత్రణలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, పోలీస్ స్టేషన్ ను ప్రజలకు నమ్మకమైన సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ సూచించారు.