NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 9:19 pm Posted by : NAMASTHE BHARAT

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

నర్సంపేట, జూలై 7 (నమస్తే భారత్ ) :

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద మంగళవారం నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో పరిశీలించారు. అలాగే నర్సంపేట పట్టణంలోని 170వ పోలింగ్ కేంద్రం పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటరు వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించి, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న పనితీరుపై ఆరా తీశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి, ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. పరిశీలన సందర్భంగా గ్రామ రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే గ్రామాల్లో సాగవుతున్న పంటలు, పంటల విస్తీర్ణం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, దుగ్గొండి తహసీల్దార్ సమ్మక్క, నర్సంపేట తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి తదితర అధికారులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.