ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

-గాజులరామారంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేత
-మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కూన శ్రీనివాస్ గౌడ్
-సంక్షేమ పథకాలను ప్రతి అర్హురాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
– పాల్గొన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, డ్వాక్రా సంఘాల సభ్యులు
గాజులరామారం, జూన్ 27 (నమస్తే భరత్):గాజులరామారం సర్కిల్ పరిధిలోని రోడ్ మేస్త్రి డివిజన్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి ప్రోత్సాహక కార్యక్రమాలు వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రతి అర్హులైన మహిళ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ముందుకు రావాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జాకీర్ బలరాం, సీహెచ్ బుచ్చిరెడ్డి, పద్మ, సలీం, రజాక్, దుర్గేష్, కల్పన, నరసింహ, ఆబేద్, లక్ష్మి, సుజాత, లావణ్యతో పాటు డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.