NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 10:16 pm Posted by : NAMASTHE BHARAT

డిజిటల్ నేరాల పట్ల అవగాహనతోనే సైబర్ రక్షణ: షాద్‌నగర్ పోలీస్

డిజిటల్ నేరాల పట్ల అవగాహనతోనే సైబర్ రక్షణ: షాద్‌నగర్ పోలీస్

నమస్తే భారత్ షాద్‌నగర్, ఆగస్టు 12:షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నా చిల్కమర్రి గ్రామంలో గల ఎమ్ ఎస్ ఎం సంస్థ ప్రాంగణంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం “సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం” (2వ వారపు సెషన్) ఘనంగా నిర్వహించబడింది. డిజిటల్ భద్రత మరియు ఆర్థిక మోసాల నివారణే (“ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్”) ప్రధాన ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నిపుణులు మరియు పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలపై వివరంగా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో వివరించిన ముఖ్య అంశాలు: ఆన్‌లైన్ ఆర్థిక మోసాల గుర్తింపు: నకిలీ స్టాక్ మార్కెట్ మరియు ట్రేడింగ్ యాప్‌లు, అధిక లాభాల పేరిట ఎరవేసే స్కీమ్‌లు, అనుమతి లేని డిజిటల్ లోన్ యాప్‌లు మరియు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు చోరీ చేసే ఫిషింగ్ లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డిజిటల్ భద్రతా నియమాలు: బ్యాంకింగ్, వ్యక్తిగత ఖాతాల భద్రతకు బలమైన పాస్‌వర్డ్‌లు వాడాలని, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. బహిరంగ వై-ఫై లలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయకూడదని, సందేహాస్పద ఎస్ ఎమ్ ఎస్ లు, వాట్సాప్ లింక్‌లను క్లిక్ చేయవద్దని కోరారు.
* అత్యవసర స్పందన (గోల్డెన్ అవర్): ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే “గోల్డెన్ అవర్” లోగా స్పందించడం అత్యంత కీలకమని తెలిపారు. బాధితులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేయవచ్చని, అలాగే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో అధికారిక ఫిర్యాదు నమోదు చేయాలని వివరించారు.
అనంతరం నిర్వహించిన సందేహాల నివృత్తి సెషన్‌లో ఉద్యోగులు అడిగిన యూపీఐ సెక్యూరిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట వచ్చే నకిలీ జాబ్ ఆఫర్లు మరియు ఐడెంటిటీ థెఫ్ట్ (గుర్తింపు చోరీ) గురించిన సందేహాలకు అధికారులు తగిన సమాధానాలు ఇచ్చి పూర్తి అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ డిజిటల్ అవగాహన పెంచుకుని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని షాద్‌నగర్ పోలీసులు కోరారు.ఎస్‌హెచ్ఓ
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్.