NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:14 pm Posted by : NAMASTHE BHARAT

మంచినీరు మురికి.. మధ్యతరగతికి మంట!

మంచినీరు మురికి.. మధ్యతరగతికి మంట!

→ వర్షాకాలంలో నీటి నాణ్యతపై ప్రజల్లో ఆందోళన

→ “నీటిని మరిగించి తాగండి” అంటే.. గ్యాస్ ఖర్చు ఎవరు భరించాలి?

→ కలుషిత నీటితో ఆరోగ్య భయం.. మరిగించడంతో అదనపు ఆర్థిక భారం

→ నాలుగు నెలల వర్షాకాలానికి ప్రతి కుటుంబానికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి

→ ఉచితంగా ఇవ్వలేకపోతే 75 శాతం సబ్సిడీ కల్పించాలి

→ ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించాలి

కుత్బుల్లాపూర్, ఆగస్టు 11 ( నమస్తే భరత్ ): వర్షాకాలం ప్రారంభమైతే చాలు.. తాగునీటి నాణ్యతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో సరఫరా అవుతున్న మంచినీటిలో మట్టి, మురుగు కలుస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నందగిరి సతీష్ కుమార్ తెలిపారు. నీరు మురికిగా వస్తోందని ప్రజలు ప్రశ్నించినప్పుడు.. భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు, జలాశయాల్లోకి వరద నీరు చేరడం వల్ల నీటిలో మట్టి కలిసే అవకాశం ఉంటుందని, నీటిని వేడి చేసుకుని తాగాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నీటిని మరిగించాలి.. మరి గ్యాస్ సంగతేంటి?

ప్రజలు తాగునీటిని మరిగించుకుని వినియోగించాల్సి వస్తే.. అందుకు అదనంగా వంటగ్యాస్ వినియోగం పెరుగుతుందని సతీష్ కుమార్ అన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల భారాన్ని ఎదుర్కొంటున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కుటుంబానికి తాగునీరు, వంట అవసరాల కోసం ప్రతిరోజూ గణనీయమైన పరిమాణంలో నీటిని వేడి చేయాల్సి వస్తే.. వంటగ్యాస్ వినియోగం పెరగడం సహజమని పేర్కొన్నారు. మంచినీటి సమస్యకు పరిష్కారంగా నీటిని మరిగించుకోవాలని సూచించే పరిస్థితి ఉంటే.. అందుకు అయ్యే అదనపు ఖర్చును కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి అని కోరారు.

నాలుగు నెలలకు రెండు సిలిండర్లు ఉచితం

వర్షాకాలం నాలుగు నెలలపాటు నీటిని మరిగించి వినియోగించాల్సిన పరిస్థితి ఉంటే.. ఆ కాలానికి ప్రతి కుటుంబానికి రెండు వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించాలని సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత సిలిండర్లు అందించడం సాధ్యం కాని పక్షంలో కనీసం 75 శాతం సబ్సిడీతో వంటగ్యాస్ సిలిండర్లను అందించాలని కోరారు.

ఉచిత పథకాలతో పాటు ప్రజారోగ్యంపైనా దృష్టి

ప్రజలకు అనేక సంక్షేమ, ఉచిత పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రజల తాగునీటి సమస్యను కూడా ప్రాధాన్యంగా పరిగణించాలని ఆయన కోరారు. ప్రజారోగ్యంతో ముడిపడిన తాగునీటి సమస్యపై ప్రభుత్వం, సంబంధిత జలమండలి అధికారులు తక్షణమే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే శాశ్వత పరిష్కారమని, నీటిని మరిగించుకుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడకుండా సరఫరా వ్యవస్థలోని లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సతీష్ కుమార్ కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు.. వర్షాకాలంలో నీటి వినియోగం కారణంగా సామాన్య కుటుంబాలపై పడే అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.