NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 10:07 pm Posted by : NAMASTHE BHARAT

దుందుగల్ వార్డులో సమస్యలపై కమిషనర్ శ్రీజన ప్రత్యేక దృష్టి

దుందుగల్ వార్డులో సమస్యలపై కమిషనర్ శ్రీజన ప్రత్యేక దృష్టి

-‘వన్ వార్డ్ ఎవరీ డే’ కార్యక్రమంలో విస్తృత పర్యటన

-స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్

-రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్య పనులకు ప్రాధాన్యం

-ఇంటి నంబర్లు, పన్ను తగ్గింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం

-వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలకు సూచనలు

-ఆక్రమణల తొలగింపు, ఖాళీ స్థలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

-అధికారులతో కలిసి వార్డు అభివృద్ధి పనుల సమీక్ష

దుందుగల్, జూన్ 30 ( నమస్తే భరత్ ): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. శ్రీజన, ఐఏఎస్ మంగళవారం “వన్ వార్డ్ ఎవరీ డే” కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని దుందుగల్ సర్కిల్-59లో ఉన్న వార్డు నంబర్-296లో విస్తృతంగా పర్యటించారు. వార్డులో నెలకొన్న పలు సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా కె.వి.ఆర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, నాగులూరు గ్రామానికి కొత్త రహదారి ఏర్పాటు, దుందుగల్ గ్రామంలో ఇంటి నంబర్ల జారీ, పన్ను తగ్గింపు ప్రక్రియను వేగవంతం చేయడం, ఐఏఆర్ఈ కళాశాల నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. అలాగే సంబేర్పూర్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుదల, ఖాళీ స్థలాల్లో చిన్నారుల కోసం ఆట వస్తువుల ఏర్పాటు, దుందుగల్ ఎస్సీ బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఆక్రమణల తొలగింపు, గగిలాపూర్ సర్వే నంబర్-214లో స్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మాణం, దుందుగల్ గ్రామంలో అవసరమైన ప్రాంతాల్లో కొత్త సీసీ రోడ్ల నిర్మాణంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సేవా స్థాయి ఒప్పందం (ఎస్ఎల్ఏ) నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిరంతరం పర్యవేక్షిస్తూ సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. ఇంటి నంబర్ల జారీ, పన్ను తగ్గింపు దరఖాస్తుల పరిష్కారం, ఇంజనీరింగ్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాలను గుర్తించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఏఎల్ఓ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ పాపమ్మ, ఎస్‌డబ్ల్యూఎం డిప్యూటీ ఇంజనీర్ అన్వేష్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, ఏఎంసీ లక్ష్మయ్య, అసిస్టెంట్ ఇంజనీర్లు బి. సురేందర్ నాయక్, అశోక్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.