NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:19 pm Posted by : NAMASTHE BHARAT

సూరారం సమస్యలపై కమిషనర్‌ దృష్టి ‘వన్ డే–వన్ వార్డ్’లో క్షేత్రస్థాయి పరిశీలన

సూరారం సమస్యలపై కమిషనర్‌ దృష్టి
‘వన్ డే–వన్ వార్డ్’లో క్షేత్రస్థాయి పరిశీలన


➤ ప్రజా సమస్యలపై ఆర్‌డబ్ల్యూఏలతో కమిషనర్‌ ప్రత్యేక సమావేశం

➤ సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

➤ ఫుట్‌పాత్‌లు, పార్కుల ఆధునీకరణకు చర్యలు

➤ వీధిదీపాల మరమ్మతులు.. కొత్త విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు

➤ స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణంపై దృష్టి

➤ ఆక్రమణల తొలగింపు.. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

 

కుత్బుల్లాపూర్‌, ఆగస్టు 11 ( నమస్తే భరత్ ): ప్రజల వద్దకే వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో చేపట్టిన ‘వన్ డే–వన్ వార్డ్’ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ జి. సృజన, ఐఏఎస్‌ మంగళవారం సూరారం వార్డులో పర్యటించారు. కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌ పింకేష్‌ కుమార్‌, ఐఏఎస్‌తో కలిసి గాజులరామారం సర్కిల్‌–57 పరిధిలోని సూరారం వార్డు (293)లో పలు ప్రాంతాలను పరిశీలించారు.

ఆర్‌డబ్ల్యూఏలతో ముఖాముఖి
సూరారం అంబేద్కర్‌ భవన్‌లో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల (ఆర్‌డబ్ల్యూఏ) ప్రతినిధులతో కమిషనర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రతినిధులు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, పార్కుల అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను వివరించారు.

రోడ్లు.. ఫుట్‌పాత్‌లకు ప్రాధాన్యం
సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు. ప్రజల రాకపోకలకు అనువుగా ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయడంతో పాటు పార్కులను ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు. వీధిదీపాల మరమ్మతులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు.

వర్షపు నీటి సమస్యకు పరిష్కారం
వర్షాకాలంలో కాలనీల్లో నీరు నిలిచిపోకుండా స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లను నిర్మించి, ఇప్పటికే ఉన్న కాలువలను మెరుగుపరచాలని స్థానికులు కోరారు. పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, కాలనీల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

దోమలపై దృష్టి
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నియంత్రణకు ఫాగింగ్‌, యాంటీ లార్వా ఆపరేషన్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని స్థానికులు కోరారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఆక్రమణలపై చర్యలు కోరిన స్థానికులు
భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను కూడా స్థానికులు కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

త్వరిత పరిష్కారానికి హామీ
స్థానికులు సమర్పించిన వినతులను కమిషనర్‌ డాక్టర్‌ జి. సృజన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైన చోట త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ యు. వెంకట్‌ రాములు, ఏఎంసీ ప్రమీల, డిప్యూటీ ఈఈ (ఎస్‌డబ్ల్యూఎం) నిఖిల్‌ రెడ్డి, ఏసీపీ సుమిత్ర, డిప్యూటీ ఈఈ (ఇంజినీరింగ్‌) మహదేవ్‌ అనురాగ్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ మల్లికార్జునతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.