అంగన్‌వాడీ కేంద్రాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం
నెలకు 150 కేంద్రాల తనిఖీ తప్పనిసరి
వరంగల్ జూలై 2 (నమస్తే భారత్ ) :
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం కలెక్టరేట్‌లో సీడీపీఓలు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఆట వస్తువులు, ప్రీ-స్కూల్ కిట్లు, బాలామృతం, గుడ్లు, పాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, 2½–6 ఏళ్ల పిల్లల నమోదు, హాజరు శాతం, ఫీల్డ్ విజిట్లపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.ప్రతి సీడీపీఓ తమ పరిధిలో నెలకు కనీసం 150 అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.తనిఖీలు కేవలం రిజిస్టర్‌లో సంతకం చేసే ప్రక్రియగా కాకుండా, పిల్లలతో మాట్లాడటం, వంటశాల పరిశుభ్రత, స్టాక్ పరిశీలన, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను తనిఖీ చేసి, ఫొటోలు, నివేదికలను అదే రోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రతిరోజూ సీడీపీఓల పనితీరును సమీక్షించి, తనిఖీల వివరాలు, గుర్తించిన లోపాలు, పరిష్కార చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో 2½–6 ఏళ్ల పిల్లల హాజరు 90 శాతానికి పైగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు సమన్వయంతో ఇంటింటి సర్వే నిర్వహించి డ్రాప్‌ఔట్స్ లేకుండాచూడాలని సూచించారు.సమీక్షలో కొందరు సీడీపీఓలు విధుల్లో నిర్లక్ష్యం వహించడం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో నిబద్ధతతో పనిచేస్తున్న సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లను అభినందిస్తూ, వచ్చే నెల సమీక్ష నాటికి జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ పూర్తి చేయాలని ఆదేశించారు.ఈసమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి రాజమణి అంగన్‌వాడీ సూపరింటెండెంట్, సీడీపీఓలు పాల్గొన్నారు.