NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 12:10 pm Posted by : NAMASTHE BHARAT

దేవేందర్ నగర్ రోడ్డుపై ఆక్రమణలకు చెక్

దేవేందర్ నగర్ రోడ్డుపై ఆక్రమణలకు చెక్

-గాజులరామారం సర్కిల్‌లో ప్రత్యేక డ్రైవ్

-పోలీసుల సమన్వయంతో రహదారిని ఖాళీ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

-ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఆక్రమణలపై కఠిన చర్యల హెచ్చరిక

-మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాలతో చర్యలు

గాజులరామారం, జూన్ 27 (నమస్తే భరత్): సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజులరామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ ప్రధాన రోడ్డుపై ఉన్న రహదారి ఆక్రమణలను శనివారం జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను సజావుగా కొనసాగించేందుకు పోలీసు శాఖ సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా రహదారిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలు, ఇతర అడ్డంకులను తొలగించి రోడ్డును పూర్తిగా ఖాళీ చేశారు. ఈ చర్యతో స్థానికంగా ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగేందుకు అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఆర్. సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ (టీపీఎస్) బి. సరిత సేన్ తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. పోలీసు సిబ్బంది కూడా బందోబస్తు నిర్వహించి డ్రైవ్‌ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజా రహదారులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, భవిష్యత్తులో రహదారులను ఆక్రమించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.