NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 3:11 pm Posted by : NAMASTHE BHARAT

విద్యారంగ సమస్యల పరిష్కారానికి జూన్ 23న ‘ఛలో సచివాలయం’

విద్యారంగ సమస్యల పరిష్కారానికి జూన్ 23న ‘ఛలో సచివాలయం’

అక్రమ ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్

తెలంగాణ విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించాలని యూఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి

విద్యార్థులు, యువజనులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొనాలి : చంద్రకాంత్

కుత్బుల్లాపూర్, జూన్ 20 ( నమస్తే భరత్ ): రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న నిర్వహించనున్న ‘ఛలో సచివాలయం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం షాపూర్‌నగర్‌లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అక్రమ ఫీజుల వసూళ్లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల బలవంతపు విక్రయాలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా, అవసరమైన విద్యా సామగ్రిని తమ వద్ద నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యారంగ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని వెంటనే నియమించాలని ఆయన కోరారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూఎస్ఎఫ్ఐ ప్రధాన డిమాండ్లలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అక్రమ ఫీజుల వసూళ్లను నిలిపివేయడం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల బలవంతపు విక్రయాలపై చర్యలు తీసుకోవడం, విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ)ను సమర్థంగా అమలు చేయడం, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 23న నిర్వహించనున్న ‘ఛలో సచివాలయం’ కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చంద్రకాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నాయకులు రవి, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.