ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సరికొత్త జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీ కోర్సులు
ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్
నర్సంపేట జూలై 9(నమస్తే భారత్ ) :
ఉన్నత విద్యను ఉపాధితో అనుసంధానం చేసే లక్ష్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), నర్సంపేటలో ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు. విద్యార్థులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ మరియు బీకాం (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బి ఎఫ్ ఎస్ ఐ) కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఉద్యోగ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విజన్–2047, జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి–2020) మార్గదర్శకాల ప్రకారం ఈ కోర్సులను రూపొందించినట్లు తెలిపారు. బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో హాస్పిటల్ మేనేజ్‌మెంట్, హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, హాస్పిటల్ అకౌంట్స్, మెడికల్ రికార్డ్స్, హెల్త్ కౌన్సెలింగ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ప్రముఖ ఆసుపత్రులతో అవగాహన ఒప్పందాల ద్వారా ఇంటర్న్‌షిప్, ఫీల్డ్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అదే విధంగా బీకాం (బి ఎఫ్ ఎస్ ఐ) కోర్సు ద్వారా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తామని చెప్పారు. బ్యాంకులు, బీమా సంస్థలు, ఫైనాన్స్ కంపెనీలు, ఎన్ బి ఎఫ్ సి లు, ఫిన్‌టెక్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కోర్సును రూపొందించినట్లు వివరించారు. తృతీయ సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ద్వారా “చదువుతూ సంపాదన” అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కళాశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, గ్రంథాలయం, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్, ప్లేస్‌మెంట్ సహాయం, పోటీ పరీక్షల శిక్షణ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), నర్సంపేటను తొలి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకుని, కొనసాగుతున్న అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ విజ్ఞప్తి చేశారు.